Thursday, October 3, 2024

అలక్ నిరంజన్ Alak Niranjan - First draft

 అలక్ నిరంజన్ అని అరుచుచు తిరిగెను

భవ భయములు బాపె బైరాగీ



వడి వడి గా వచ్చి ద్వారము ఎడ నిలిచి

భిక్షకై పిలిచెను ఆ జోగి !



చందన తిలకము విభూతి ధరియించిన

కాషాయ ధారీ సుందర సన్యాసి,

అలక్ నిరంజన్ అని అరుచుచు తిరిగెను

భవ భయములు బాపె బైరాగీ !



ఎద ఝల్లుమంది, తనువు పులకరించింది,

అగ్గి ముందు బాసలు మనసు మరిచిపోయింది


నిర్మల ప్రశాంత నయన సాగరంలో

ఉరుము మెరుపుల తుఫాను చెలరేగింది



తడమాడె తలపులకు సిగ్గుతొ

గులాబి రంగులో బుగ్గ ఎరుపెక్కింది !



అలక్ నిరంజన్ అని అరుచుచు తిరిగెను

భవ భయములు బాపె బైరాగీ !


అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ ...

వినిపించే ఆ గొంతు మరలానూ

ఉరుముల మెరుపుల ఆనందం తిరిగొచ్చె

కన్నుల్లో మరలానూ


ఏడడుగులు విడిచేసె

పెళ్ళి నాటి శపదాలు వదిలేసె

వచ్చేటి భిక్షువు గంటల మోతలకే



విచక్షణ విడిపోయే, మనసేమో చెలరేగే

తనువున ప్రేమా గర్చించగనే !



రంగు రంగుల చీరను తీరుగ సరిచేసి

సింగారించుకున్నదామె సొగసుగా



ఆగాగు ఓ యోగి, నీ కళ్ళల్లో ఆ కాంతి

అంతంత మెరుపు ఎటులొచ్చెనో



తళుకుల మణులోలె రవిశశి మించిన

దీప్తితో అవి ఏల ప్రకాశించునో


అలక్ నిరంజన్ అలక్ నిరంజన్

మరుదినము మరలొచ్హే బైరాగీ

చప్పున తెరతీసి గడపను దాటేసి

సొంపుగ చూసెను తనకేసి !




అమ్మా అని పిలిచి ఆమెకు

భిక్ష పాత్ర నందించే ఆ యోగి



పాత్రలో పొర్లాడె ధగ ధగ మెరసిన

పంకజముల పాటి నయనాలు !

*

అమ్మా నిన్ననె పొగిడావు నా కళ్ళ అందానినే

పెకలించి తెచ్చాను పెళ్ళైన నీ మనసు

పెడదారి పట్టించిన ఆ కళ్ళనే 



అలక్ నిరంజన్ అలక్ నిరంజన్

వెడలేను ఆ జోగి నిర్మోహుడై



కన్నులను తెరిపించ

తన కన్నులు వదిలేసె

నిర్మలముగా ఆ సన్యాసి 

అలక్ నిరంజన్ అలక్ నిరంజన్!